వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 24: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని, అప్పటి వరకు కోల్ ఇండియా హైపవర్ కమిటీ వేతనాలు, ఏరియర్స్‌తో సహా చెల్లించాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ఐక్య సంఘం డిమాండ్ చేసింది.ఈ మేరకు బుధవారం మందమర్రి సివిక్ అడ్డా వద్ద సంఘం గౌరవాధ్యక్షుడు సంకె రవి, బెల్లంపల్లి రీజినల్ కార్యదర్శి దూలం శ్రీనివాస్ కాంట్రాక్ట్ కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని హామీలు ఇచ్చాయని, కానీ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని ఆరోపించారు.కనీసం కోల్ ఇండియాలో ఒప్పందం ప్రకారం అమలు చేయాల్సిన హైపవర్ కమిటీ వేతనాలను కూడా అమలు చేయడం లేదని, పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. సింగరేణిలో పర్మనెంట్ కార్మికులు మిగులుగా ఉన్నారనే కారణంతో భవిష్యత్తులో కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రయత్నాలు. జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.రాబోయే రోజుల్లో కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయడం, పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న హైపవర్ కమిటీ బకాయిలను చెల్లించడం కోసం చేపట్టే పోరాటాలకు కార్మికులు సిద్ధంగా ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మందమర్రి డివిజన్ సహాయ కార్యదర్శి బచ్చలి సురేందర్‌తో పాటు పలువురు కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం