వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తూ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం దండేపల్లి మండలం ద్వారకలో నిర్మాణంలో ఉన్న ఎస్టీ బాలుర వసతి గృహం, జడ్పీ ఉన్నత పాఠశాల, కేజీబీవీతో పాటు లక్షెట్టిపేట కేజీబీవీని సందర్శించి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం, నాణ్యమైన విద్య అందించడంతో పాటు వంటశాలల్లో పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెంచేందుకు తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలని తెలిపారు.అనంతరం లక్షెట్టిపేట రైతు వేదికలో దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల బీఎల్వోలు, గ్రామ కార్యదర్శులు, వాలంటీర్లకు నిర్వహించిన శిక్షణలో పాల్గొని ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి అర్హుడిని ఓటరుగా నమోదు చేయడంతో పాటు డూప్లికేట్ ఓటరు కార్డుల తొలగింపు, మరణించిన లేదా గ్రామం విడిచిన వారి వివరాల నవీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్యుమరేషన్ ఫారాలను సకాలంలో డిజిటలైజ్ చేసి జిల్లాలో సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
Reporter
వాస్తవ గమ్యం