వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఎస్‌బీఐ బ్యాంకు మాదిరిగానే యూనియన్ బ్యాంకులో ఖాతాలు కలిగిన సింగరేణి కోల్ పెన్షన్‌దారులకు కూడా రూ.50 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంకు శాఖ ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ గుల్షన్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. సంఘం నాయకులు మాట్లాడుతూ, గత రెండు నెలలుగా యూనియన్ బ్యాంకు అధికారులను పలుమార్లు కలిసి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరినప్పటికీ తగిన స్పందన లభించలేదని తెలిపారు. దీంతో నిరసన కార్యక్రమం నిర్వహించి మరోసారి తమ డిమాండ్‌ను అధికారుల దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు.ఎస్‌బీఐ బ్యాంకు అందిస్తున్న విధంగానే యూనియన్ బ్యాంకు కూడా సింగరేణి కోల్ పెన్షన్‌దారులకు ప్రమాద బీమా సౌకర్యాన్ని అమలు చేయాలని వారు కోరారు. ఈ అంశంపై 15 రోజుల్లోగా బ్యాంకు యాజమాన్యం స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని, లేనిపక్షంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి యూనియన్ బ్యాంకు శాఖల ఎదుట పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, గౌరవ అధ్యక్షుడు రాళ్లబండి రాజన్న, ప్రధాన కార్యదర్శి పుదారి నర్సయ్య, ఉపాధ్యక్షులు ఏ. గంగయ్య, పి. రాంరెడ్డి, నాయకులు పోతురాజుల చంద్రయ్య, ఇరుకుళ్ల జనార్దన్, ఎన్నం శంకర్, టి. జనార్దన్ స్వామి, శశాంక్ రావు, బి. కృష్ణ, ఎస్. ఘటయ్య, కనిగంటి లచ్చయ్య, కాటం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం